Sunday 12 January 2014


స్థానిక స్వపరిపాలన

ప్రాచీన కాలం నుంచి మన దేశంలో స్థానిక స్వపరిపాలన విధానం అమల్లో ఉంది. మౌర్యులు, చోళులు, పల్లవుల సామ్రాజ్యాల్లో స్థానిక స్వపరిపాలన సంస్థలు అభివృద్ధి చెందాయి.
'చార్లెస్ మెట్‌కాఫ్' భారత గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలను 'లిటిల్ రిపబ్లిక్స్‌'గా అభివర్ణించాడు. మన దేశంలో ప్రాచీన కాలం నుంచే స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉన్నాయని మెగస్తనీస్ 'ఇండికా' అనే గ్రంథంలో పేర్కొన్నాడు.

శుక్రాచార్యుడు తన నీతి శాస్త్రంలో గ్రామాల కామన్‌వెల్త్ ఉన్నట్లుగా పేర్కొన్నాడు. రామాయణంలో జనపదాన్ని అనేక గ్రామాల సమాఖ్యగా వర్ణించారు. 'గ్రామ సంఘాలు' అనే పేరుతో పరిపాలన జరిగినట్లు మహాభారతంలోని శాంతిపర్వం తెలియజేస్తుంది.
మధ్యయుగంలో స్థానిక స్వపరిపాలన నిర్లక్ష్యానికి గురైంది. ఈ కాలంలో నిర్మాణాత్మక సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా స్థానిక ప్రజల అవసరాలు తీర్చడానికి ఎలాంటి కృషి చేయలేదు. మొగలుల కాలంలో ఏర్పాటు చేసిన కొత్వాల్ వ్యవస్థ శిస్తు వసూలు, శాంతి భద్రతల పరిరక్షణపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ వహించలేదు.
ప్రజాస్వామ్యం విజయానికి పరిపాలనలో వికేంద్రీకరణ అవసరమని పేర్కొనే బ్రిటిష్‌వారు కూడా స్థానిక సంస్థల అభివృద్ధిని పట్టించుకోలేదు. వారు జిల్లా కలెక్టర్ పదవిని ఏర్పాటు చేసి శిస్తు వసూలుపైనే దృష్టి కేంద్రీకరించారు.

1870లో లార్డ్ మేయో కాలంలో ప్రవేశపెట్టిన తీర్మానం బ్రిటిష్‌వారి దృక్పథంలో మార్పును తెలియజేస్తుంది.

1882లో 'రిప్పన్ ప్రభువు' ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు 'మాగ్నాకార్టా'గా పేర్కొంటారు. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు తమ స్థానిక అవసరాలను సొంతంగా నిర్వహించుకోవడాన్ని స్థానిక స్వపరిపాలన అంటారు.
అధికారాన్ని స్థానిక సంస్థలకు అప్పగించడమే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ (Democratic Decentralisation).
స్థానిక స్వపరిపాలన సంస్థల ఆవశ్యకత

గ్రామ, పట్టణ సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కంటే స్థానికులకే బాగా తెలుస్తాయి. తమ అవసరాలకు అనుగుణంగా చక్కటి పథకాలను రూపొందించుకుని, నిర్వహించుకునే అవకాశం వారికి ఉంటుంది. మంచినీటి సరఫరా, మురికినీటి కాల్వల నిర్మాణం - నిర్వహణ, రోడ్లు, వంతెనలు, విద్య, వినోదం, ఆరోగ్యం, పరిశుభ్రత, వీధి దీపాలు మొదలైనవాటిని స్థానిక ప్రజల అవసరాలుగా పేర్కొనవచ్చు. వీటిని స్థానికులు పొదుపుగా, త్వరగా, సమర్థవంతంగా తీర్చుకోవచ్చు. స్థానిక అవసరాలను స్థానికులే తీర్చుకోవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తగ్గుతుంది. జాతీయ సమస్యల పరిష్కారం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి ప్రభుత్వాలకు అవకాశం ఉంటుంది.
స్థానిక స్వపరిపాలన సంస్థల వల్ల ప్రయోజనాలు

¤  స్థానిక స్వపరిపాలనా సంస్థలు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకువస్తాయి.
¤  సాధారణంగా స్థానిక పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం ఉంటుంది. ఈ శిక్షణ, అనుభవం భవిష్యత్తులో వారు రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రభుత్వాల్లో సమర్థవంతంగా పాల్గొనేందుకు సహాయపడతాయి
¤  పౌరుల్లో మంచి లక్షణాలు, స్నేహభావం, త్యాగం, బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తాయి.
¤  అధికార వికేంద్రీకరణ కార్యరూపం దాల్చడానికి ఈ సంస్థలు దోహదం చేస్తాయి.
¤   స్థానిక పాలనలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల జోక్యాన్ని తగ్గించి స్థానిక ప్రజల స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని కాపాడతాయి.
¤    ప్రజాస్వామ్య విజయం చాలావరకు స్థానిక స్వపరిపాలన సంస్థలపై ఆధారపడి ఉంటుంది.
¤   ప్రజాస్వామ్య సంస్థల పట్ల ప్రజల సహకారానికి స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రోత్సాహం ఎంతో అవసరం.
స్వాతంత్య్రానంతరం మన రాజ్యాంగం స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. ఆదేశిక సూత్రాల్లోని 40వ అధికరణలో గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి పేర్కొన్నారు. స్వయం పరిపాలనా విభాగాలుగా రూపాంతరం చెందడానికి అవసరమయ్యే అధికారాలను వాటికి ఇవ్వాలని సూచించారు. జాతిపిత మహాత్మాగాంధీ కూడా గ్రామ పంచాయతీల ఏర్పాటు, వాటిని అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యాన్ని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక స్వపరిపాలన విధానం
ఆంధ్రప్రదేశ్ 1956 నవంబరు 1న ఏర్పడింది. 1959లో బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచించిన మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని రాష్ట్రంలో అమలుచేశారు. రాజస్థాన్ తర్వాత ఈ విధానాన్ని అమలుపరిచిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. తర్వాత చాలా రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలుచేశాయి. అన్ని రాష్ట్రాల్లోనూ పంచాయతీరాజ్ వ్యవస్థ ఒకే రకంగా లేదు. కొన్ని మూడంచెల విధానాన్ని అమలుచేస్తే, మరికొన్ని రెండు లేదా ఒక అంచె విధానాన్ని ప్రోత్సహించాయి. ఈ సంస్థల పేర్లు కూడా వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి.
1959లో ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేసిన స్థానిక స్వపరిపాలనా విధానంలోని మూడంచెలు
1) గ్రామ స్థాయి - పంచాయతీ
2) బ్లాకు స్థాయి - పంచాయతీ సమితి
3) జిల్లా స్థాయి - జిల్లా పరిషత్
మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ 1986 వరకు అమల్లో ఉంది. తర్వాత ఈ విధానంలో కొన్ని మార్పులు చేశారు.
పంచాయతీ సమితి ఆధ్వర్యంలో ఎక్కువ గ్రామాలు ఉండటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలుకావడం లేదని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ పాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే ఉద్దేశంతో 20-30 గ్రామాలతో ఒక మండల ప్రజాపరిషత్‌ను ఏర్పాటు చేశారు. ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం 1104 మండల ప్రజాపరిషత్‌లు ఏర్పడ్డాయి. ఈ వ్యవస్థ కూడా మూడంచెల్లోనే ఉంది. అవి
           1) గ్రామ స్థాయి - గ్రామ పంచాయతీ
           2) మండల స్థాయి - మండల ప్రజాపరిషత్
           3) జిల్లా స్థాయి - జిల్లా ప్రజాపరిషత్
ఈ విధానం 1994 వరకు అమల్లో ఉంది. ప్రస్తుత స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏర్పడింది. ఇది కూడా మూడంచెల్లోనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1125 మండల పరిషత్‌లు ఉన్నాయి.
           1) గ్రామ స్థాయి - గ్రామ పంచాయతీ
           2) మండల స్థాయి - మండల పరిషత్
           3) జిల్లా స్థాయి - జిల్లా పరిషత్
స్థానిక స్వపరిపాలనా సంస్థలను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి
           1) పట్టణ ప్రాంతాల పాలన
           2) గ్రామీణ ప్రాంతాల పాలన

No comments:

Post a Comment